Tuesday, September 7, 2010

రక్తకన్నీరు

रगोमें दौड़ते फ़िर्नेके हम नहीं खायिल !
जब आँख ही से टपका तो फ़िर लहू क्या है !!


ధమనుల్లో పరుగెత్తడం, ఏముంది అందు గొప్పతనం;
కళ్ళనుండి రాలినపుడే రక్తమౌతుంది సార్థకం.
__గాలిబ్

Wednesday, September 1, 2010

వర్షాకాల నియంత

వర్షాల ఉత్కర్షకు హర్షించే
సంపన్నులొక వైపు,
భాగ్యనగరిలో భయంతో
బ్రతికే అభాగ్యులొక వైపు

బీదల వీథులన్నీపర్జన్యుని
బాధల్లో బంధీలయ్యాయి

వాళ్ళ
గూళ్ళన్నీ వానకు
మళ్ళీ వరి
మళ్ళయ్యాయి


వరుణుడి చల్లని బాణాలకు
వృద్ధుల ప్రాణాలు పారిపోయాయి
గొల్లున ఏడ్చిన పిల్లల తనువులు
తల్లుల ఒళ్లలో ఒదిగి పోయాయి

ఏతం ఎత్తినట్లు ఆడవాళ్ళు
నీళ్ళు తోడేస్తున్నారు
పొంచి ఉన్నఉపద్రవాలు విని
ఆర్తులు అప్రమత్తులయ్యారు

నీడలేని నిరాశ్రయులకు
పస్తులు, జాగారాలు
ఐశ్వర్యుల హర్మ్యాలలో
నిరంతర నిశావైభోగాలు

ఒకరిది రేపటిపై నైరాశ్యం
ఆశనిపాతంలాంటి ఆక్రోశం;
ఒకరిది కలల వలలో
చిక్కిన ఉత్సవపరితోషం

కొత్తనవాబుల విలాసాల విడిదిలో
గజల్లు, గంధర్వగానాలు
వెచ్చని శాలువాలు,
నచ్చిన షాయరీ శకలాలు


మత్తెకించే ఉన్మదన సౌరభాలు

రులనే మాయజేయు ఒయ్యారాలు

మాటిమాటికి జారే జరీజార్జెట్లు
నాభినక్షత్రాలు ప్రదర్శించే కోక్కట్లు

ప్రమాద హేతువులాయె
ప్రమదాపరిధానాలు

శ్రావణ జడివానల ప్రతి జల్లు
వారుణీవరులను గిల్లు కలిగించును థ్రిల్లు
చేతుల్లో మైమరిపించే
మధువు
అధరాలపై
మృదు ఉరుదూకవితావధువు



క్లబ్బుల్లో జబ్బులుపెంచే పబ్బుల్లో
వికృతవినోదాలు, నికరక్రీడలు
గాలి ఆడని బస్తీల్లో నీటికోసం
కుస్తీలు, దోమకాట్లకు సుస్తీలు

స్టార్ హోటళ్ళ స్కాచ్ బాళ్ళనుంచి
జాలువారే మనోహరమదిరాలు
ప్రియసఖీ సంయోగ కవోష్ణ-
సుఖాలందించే స్వప్నమందిరాలు

ఇదేమి న్యాయమో
ఇదెక్కడి ధర్మమో
ఇదేమి స్వామ్యమో
ప్రజల సంక్షేమమో

ఈ వర్షాకాలనియంతకు
బానిసలయిరి నా ప్రజలు
ప్రకృతి వైపరీత్యాలను
పండుగ చేసిరి పాలకులు