నిప్పురవ్వలా నిజాయితి నిలుపుకో మరి; మాట
తప్పినట్టు ఋణదాత తలచినంతనే, పరువు
అప్పడమువలె నైతికముగా పలుచబడును.
"If a loan needs to be collected, the moral fund on which it is secured is already bankrupt."
(it means that a gentleman-borrower should always pay back the loan, well before being reminded by the lender)
పై వాక్యం ఎక్కడ చదివానో గాని నా మస్తిష్కంలో ప్రతిష్టితమైపోయింది. నా ప్రతి ఆర్థిక లావాదేవిలో నన్ను జాగ్రత పరిచింది. అయితే నేను తు.చ. తప్పకుండ ఈ సుభాషితాన్ని పాటించినా ఎదుటి వాళ్ళు నన్ను చాలా సార్లు మదనపెట్టారు.
మనిషి ఎంత జాగ్రత పరుడైనా జీవితంలో ఎప్పుడో ఒక సారి అప్పు చేయాల్సి వస్తుంది. ఎంతటి ధనవంతులయినా విపత్కర సమయంలో (crisis) అహాన్ని స్వాభిమానాన్ని పక్కనపెట్టి, అవతలి వాళ్ళు వీరి దృష్టి లో ఏ స్థాయి వారైనా, చివరికి అపరిచయస్తులైనా సరే, సహాయం అర్థించ వలసివస్తుంది. ఈ విధంగా వ్యక్తులేకాదు సంస్థలు దేశాలుకూడా ఋణబారీన పడాల్సివస్తుంది. అందుకే ప్రపంచంలో అన్నీ వర్గాలకు అప్పు సహాయం చేసే రకరకాల సంస్థలున్నాయి. విశ్వ విపణిలో ఋణపంపిణీవ్యవస్థ ఒక గొప్ప సేవా జాలమై విశ్వసమాజానికి సేవ చేస్తున్నది. బీదల కోసం అతి సూక్ష్మ రుణాలు మొదులుకొని దేశాలకోసం, సంస్థలకోసం అతి పెద్ద బృహత్ రుణాలు సమకూరుస్తున్నాయి. ఋణ వ్యవస్థ (credit and advance, loan facility) లేని సమాజాన్ని ఇప్పుడు ఊహించడమే అసాధ్యం.
అప్పంటే కేవలం డబ్బు అరువుతెచ్చుకోవటం కాదు. అది వస్తు రూపంలో కూడా కావచ్చు. ఒకరి దగ్గరినుండి మన అవసారలకోసం ఏదయినా తెచ్చుకున్నామంటే అలా తెచ్చుకున్నవాడు ఋణ గ్రహీతగా, ఇచ్చిన వాడు ఋణదాతగా పిలవ బడుతారు. ఋణగ్రహీతగా ఉన్నంత వరకు మర్యాదగానే ఉంటుంది. సంసారి ఋణగ్రస్తుడుగా రూపాంతరం చెందడంతో అన్నీ వికారాలు బయలు దేరుతాయి. అప్పు, చేతిబదులు, అరువు మొదలైనవన్నీ పర్యాయ పదాలే. ఋణం కిందికే వస్తాయి. సామాజికంగా, నైతికంగా, స్వాభిమానపరంగా కూడా ఇచ్చేవానిదే పైచేయి. అయితే ఒప్పుకున్న షరతుల ప్రకారం గడువులోపే, అంటే ఇచ్చినవాడు గుర్తుచేయకముందే, కృతజ్ఞతాభావంతో అప్పు పూర్తిగా తీర్చివేయడం గొప్ప సంస్కారం. ఋణశేషం ప్రమాదకరమైనది.
వ్యక్తిగతంగా, అరువు/అప్పు అడగడం అనేదే ఒక అప్రతిష్టాకరమైన విషయం. ఇక ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అప్పు సహాయం అర్థించడం అవాంఛనీయం. సమాజంలో మనకు చాల మంది తారస పడుతూ ఉంటారు, నిర్లజ్జగా వ్యవహరించి అందరిచేత అమర్యాదకు గురిఅవుతారు. ఉత్తముడు ఇల్లాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటాడు. అంటే వాడికి అవసరాలు ఉండవని కాదు. వాడు ఉన్నంతలోనే తన పరిధిలోనే ఇహావసరాలను తీర్చుకుంటాడు. అందుకే షేక్స్ పియర్ "....neither a borrower, nor a lender be; for loan oft loses both itself and friend. And borrowing dulls the edge of husbandry." అని గొప్ప సలహా చెప్పాడు. అంటే అప్పు చేయకు, అప్పు ఇవ్వకు; చాలాసార్లు అప్పు తీసుకున్న ఆ మిత్రుని స్నేహితం మిగలదు ఆ ఇచ్చిన అప్పు ఆరతిలోని కర్పూరమై ఎగిరిపోతుంది. అప్పు చేయడమంటే మనకు వ్యవహారాలను చక్కబెట్టుకునే సామర్థ్యం కొరవడినట్లే.
ఇంకొక ముఖ్య విషయమేమంటే ఈ అప్పు పరిమాణము మరీ చిన్నదయినప్పుడు చాలాసార్లు తీసుకున్నవాళ్లు మరిచిపోయినట్టు వ్యవహరిస్తారు. నిజంగానే వాళ్ళు మరిచిపోయినప్పటికి ఆ అరువు/బదులు ఇచ్చిన మానవుడు ఎప్పుడూ మరిచిపోడు. అప్పు తీసుకొన్న వ్యక్తి కనిపించినప్పుడల్లా మనసులో విషయం మెరుస్తుంది. కాని ఇచ్చిన అప్పు చిన్నదైన కారణంగా మనసులోనే బాధ పడతాడు. ఒక్కోమారు పరోక్షంగా అప్పు విషయాన్ని గుర్తుచేయడానికి ధ్వనిరూపంగా వ్యంగ్యోక్తులతో మాట్లాడుతాడు. ఉదాహరణకు: కూరగాయల మార్కెట్లో అప్పు ఇవ్వడం జరిగిందనుకుందాం. కూరగాయల ధరల విషయం అప్రస్తుతంగా చర్చకు తెస్తాడు. 'కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి' అని ఆ విషయం తను పరిశోధించి తేల్చినట్టు ప్రస్తావిస్తాడు. అప్పు తీసుకున్న వ్యక్తి సున్నితమనస్కుడై నిజాయితీ పరుడయితే తప్పును గ్రహించి అవసరమనుకుంటే పాశ్చాత్తాపపడినట్టు నటించి అప్పు తీర్చుకుంటాడు - కృతజ్ఞత ప్రదర్శించ వచ్చు కూడా. గజచర్మదారులపై ఇలాంటి సున్నిత సంకేతాలు పని చేయవు. అట్లా కాకపోయినా చేసేదేమిలేక ఇచ్చింది తిరిగి వచ్చినందుకు అప్పిచ్చిన జీవి సంతోష పడతాడు. కాబట్టి చేతి బదుల్లు చిన్నపాటి అప్పులు చాలా ప్రమాదకరమైనవి. అయితే చిన్న చిన్న చేతిబదుల్లు తిరిగి రాకపోయినా కొన్ని సార్లు లేక్కచేయకపోవటం అప్పిచ్చి పోగొట్టుకున్న బాధితునికి మంచి చేస్తుంది. అప్పు తీసుకున్నవారు చాల తక్కువమంది మరిచిపోతారు. చాలా సార్లు వాళ్ళు గుర్తులేనట్టు నటిస్తారంతే. అలాంటి వాణ్ని మళ్ళీ అడిగేలా చేయోద్దంటే ఆ చిన్నపాటి అప్పును ముంచుడు ఖాతా (bad debts) క్రింద వదులుకుంటే చాలు. తీసుకున్న వానికి ఎప్పుడూ భయంగా నామోషి గా ఉంటుంది ఎదుటిని వాని ముందు. కాబట్టి ఇదొక అడ్డుకట్టలా పని చేస్తుంది ఇంకొక దాడి నుండి. నేను చాలా సార్లు ఈ చిట్కాను పాటించాను, పని చేసింది.
ఎదుటివానితో ఏదైనా ప్రయోజనం ఆశించి లోబరుచుకోవడంకోసం అప్పివ్వడానికి, అనభ్యర్థితసహాయం (unsolicited courtesy) చేయడానికి సదా తహతహ లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనోహరసౌందర్యసంపద, అధికారబలం ఉన్న స్త్రీపురుషులకు ఈ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇది ఇంకో వర్గం. మీకు వీలైనప్పుడే తిరిగివ్వండి (payable when able) అని మరీ చెప్పే ఇస్తారు. ఎంత కష్టతరమైన పనినైనా 'అదెంత పనండీ' అంటారు. వీళ్ళ ప్రణాళికలు దురుద్దేశ్యంతో (ulterior motive) కూడి ఉంటాయి. అవి మన చర్చ పరిధిలోనివి కావు.
అప్పు చేయడం నేరమేమి కాదు. కాని అప్పిచ్చినవాడు ఆ అప్పు విషయం తీసుకున్న వానికి గుర్తుచేసి వసూలు చేసే పరిస్థితి వచ్చిందంటే అప్పు చేసినవాడు నైతికంగా దివాలా తీసినట్టే. ఇందులోని నీతి ఏమంటే అప్పు తప్పనిసరి అయిన పక్షంలో పెట్టుకున్న గడువు లోపే అప్పిచ్చినవాడు గుర్తుచేసి వసూలు చేయకముందే ఖచ్చితంగా తీర్చెయ్యాలి. ఇది ఉత్తమ మార్గం. ఇది సుజనులుకుండే సౌజన్యము, సుసంస్కారము. ఋణదాత బ్యాంకయినా కావొచ్చు, ఒక సంస్థ కావొచ్చు, మిత్రుడు కావొచ్చు, పొరిగింటి వాళ్ళు కావొచ్చు. ఇట్లాకాక, మాట తప్పి ఋణదాతను ముప్పుతిప్పల పెట్టి అప్పు తీర్చడమనేది న్యాయపరంగా చెల్లుతుందేమో కాని నైతికంగా సంస్కార రాహిత్యాన్ని ప్రదర్శిస్తుంది. అనుకున్న గడువులోపే అప్పు తీర్చడం శిష్టాచారం. గుర్తుచేయించుకొని రకరకాల కారణాలు వల్లించి రుణదాతను విసిగించి ఏడ్పించి అప్పు తీర్చడం అధమం. పరువు అనే సామాజిక సంపద కల్గినవాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. 'ప్రాణ్ జాయె పర్ వచన్ న జాయె' అనే సూక్తి సజ్జననీతి.
"ఋణం కృత్వా ఘృతం పిబేత్ యావజ్జీవేత్ సుఖం జీవేత్ - భస్మీ దేహస్య భూతస్య పునరాగమనం కుతః" అంటే అప్పుచేసైనా సరే బ్రతికున్నంత కాలం హాయిగా జీవించు, అప్పు ఎగగొట్టినా పాపం లేదు. ఎందుకంటే చచ్చినోడు ఎవడూ మళ్ళీ తిరిగిరాడు. ఇట్లా ప్రతిపాదించిన చార్వాకుని సిద్ధాంతమనుసరించి అప్పు ఎగగొట్టడం అధమాధమము, దుర్మార్గము, దౌర్జన్యము. కాబట్టి అప్పులిచ్చే ఉదార హృదయులు కూడా మన ప్రాచీనుల అనుభవాన్ని ఎల్లప్పుడు గుర్తుంచుకొని ఈ వ్యవహారంలో అడుగుపెట్టాలి.
'పుస్తకం, వనితా, విత్తం, పరహస్తగతం గతం - అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టా చ ఖండశః'
అంటే పుస్తకము, స్త్రీ, ధనము పరుల చేతుల్లోకి పొతే తిరిగి రావు; ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకము చిరిగిపోయి పిచ్చిగీతల పాలై, స్త్రీ బద్నామయి(బ్రష్టురాలై), ధనం ముక్కలు చెక్కలై చేరుతాయి. తస్మాత్ జాగ్రత!