Sunday, July 18, 2010

గాలిబ్ - జన్నత్ - భక్తి ప్రపత్తి

बंदगी में भी वो आज़ाद-ओ-ख़ुदबीन हैं के हम
उलटे फ़िर आये दर-ए-काबा अगर वा न हुआ


భక్తి ప్రపత్తుల్లోనూ మేమెంతో స్వతంత్రులం
మాకుంది అభిమానసుఖం !
'కాబా' ద్వారం తెరిచి లేకుంటే
పడతాము మేము తిరుగుముఖం !!

__గాలిబ్


చూసారా గాలిబ్ వ్యక్తిత్వం ఎలాంటిదో. మహా అహంకారి. సంప్రదాయ మతానికి చెందిన నిర్దిష్ట కర్మలు,వాటి మర్మాన్ని ఆంతర్యాన్ని ఎరిగిన అసలైన సిసలైన మానవతావాది గాలిబ్. ఛాందస వ్యవహారాలంటే ఆయనకు గిట్టవు. ఈనాటి మతపిచ్చి గాలిబ్ లాంటి మహాకవిని సహించలేదు. పైన చెప్పిన భావము కల 'చమత్కవిత' ఈ శతాబ్దిలో ఏ ముస్లిం కవి కైనా చెప్పడం అతికష్టం.
గాలిబ్ మత గ్రంథమైన ఖురాన్లో చెప్పబడ్డ స్వర్గం (జన్నత్) ను ఎన్నడూ కోరుకోలేదు. ఇహలోకంలోఇస్లాంని తు.చ.తప్పకుండా పాటించే ముస్లిములకు పరలోకంలో ప్రసాదిస్తానని అల్లా ఒప్పుకున్న అనంతభోగాల సమాహారమే జన్నత్. గాలిబ్ ని ఆ జన్నత్ సుఖాలు ఆకర్షించకపోవడానికి కారణం, అచ్చట వర్ణించబడ్డ స్వర్గం ఎలాంటిదో , అక్కడ లభించే సుఖసౌఖ్యాలు ఏపాటివో ఆయనకు బాగా తెలుసునట. కాబట్టి ఆ కథాకథిత 'జన్నత్' గురించి గాలిబ్ పట్టించుకోలేదు. 'జన్నత్' అనే భావన మనసును సంతోషపెట్టేందుకు మాత్రం బాగా పనికి వస్తుంది అని అంటాడు. ఇహలోకంలోని సుఖాలను కాదని ఎక్కడో ఉందని చెప్పబడుతున్న పరలోకసుఖాలకోసం గాలిబ్ అర్రులుచాచినట్టు ఎక్కడా కనిపించదు.ఇలాంటి భావజాలాన్ని ఈ సహనంలేని అతివాద యుగంలో చెప్పడం ముస్లిం సమాజంలో పుట్టిపెరిగిన బుద్ధిజీవులకు దాదాపు అసాధ్యమే. ఈ కవితావాక్యాన్ని పరిశీలించండి.
हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन,
दिल के ख़ुश रखने को ग़ालिब ये ख़याल अच्छा है

మేమెరుగుదుము జన్నత్ లోని వాస్తవాలు, అయినా.....
మనసును సంతోషపెట్టేందుకు గాలిబ్, బావుంది భావన

Friday, July 16, 2010

అసదుల్లః ఖాన్ గాలిబ్ గురించి బహుశ తెలియని వారుండరు మన దేశంలో. ముఖ్యంగా తెలంగాణాలో ఇంకాముఖ్యంగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారు ఎవరైనా సరే వాళ్ళ మాతృభాష ఏదైనా సరే వారికి సాహిత్యంలో ప్రవేశంఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబ్ గురించి తప్పకుండ అప్రయత్నంగానైనా వినే ఉంటారు. ఏదో ఒక కవిత గాలిబ్ దో లేకపోతె గాలిబ్ పేరున చెప్పిందో వినే ఉంటారు. అర్థం అయినా కాకపోయినా 'వాః క్యా బాత్ హై' అని స్పందిచేఉంటారు. ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదు. హైదరాబాద్ సంస్కృతి చాల విలక్షణమైనది. ఇక్కడివారు ఇంట్లోమాట్లాడేభాష ఏదైనాకాని వాళ్ళు ఇంటిబయట వాడుకునే 'మాట' భిన్నంగా ఉంటుంది. ఉర్దూ తో ఉన్న అనుబంధం మూలాన ఇక్కడి భాష చాలా సంపన్నమైనదనే చెప్పాలి. ఉర్దూ ద్వారా ఎన్నో తుర్కి, పార్సీ, అరబ్బీ పదాలు తెలుగు లోకి చేరిపోయాయి. సంస్కృతం తర్వాత ఉర్దూ పదాలే తెలుగులో గుర్తు పట్టలేనంతగా మిలితమైపోయాయి. ఉర్దూ క్రియారూపాలు తెలిగించబడి తెలగాణ్యుల భాషలో ఏ రకంగా మమేకం పొందాయి అనేది పరిశోధనకు సామగ్రి. ఉదాహరణకు: గుసాయిస్తున్నాడు , ఫిలాయిన్చిండు , రోకాయిస్తున్నాడు.మన పత్రికల్లో వాడేభాషలో నుంచి సంస్కృతం ఉర్దూ పదాలు ఏరి వేస్తె గందర గోళం మిగులుతుంది. ఒక సారి ప్రయత్నించండి.

దీవాన్-ఎ-గాలిబ్ చదువుతాను. నాకు కూడా గాలిబ్ ని తర్జుమా చేయాలని కోరిక పుడుతుంది ఒక్కోసారి.అంత సాహసమా! తరతరాలనుండి గడ్డపై ఉన్నవాళ్ళం కాబట్టి మాత్రం ఉత్సుకత ఉండాల్సిందే మరి. ఒక పదిషేర్లయినా తెలుగో ఇంగ్లీషో చేయాలని ప్రఘాడ కోరిక నాది. చూద్దాం. రకంగా అలోచించి రెండు తెలిగించాను. తెగించాను. ఉర్దూ లిపి నాకు లభ్యం కావడం లేదు కాబట్టి హిందీ లో మూలాన్ని రాస్తున్నాను.
చదివి విమర్శించండి.

ये मसाइल- तसव्वुफ़, यह तेरा बयान ग़ालिब
तुझे हम ली समझते, जो बादा-ख्वार होता

గాలిబ్! నిగూఢ సూఫీవాదం, నీ విలక్షణాభివ్యక్తి
నిను ఋషిగా కొలిచే వాళ్ళం నువు మధువుకు చెపితే స్వస్తి

Ah Ghalib! the mystique of your plaint
your expressions so fine;
We'd have taken you for a saint
had you not taken to wine.

इशरत-ए -खत्रह है दरया में फ़ना हो जाना;
दर्द का हद से गुज़र् जाना है दवा हो जाना

బిందువుకు సింధువులో విలీనమే ఆనందం;
శోకం హద్దులు దాటితే అవుతుంది ఔషధం.

हुए मर के हम जो रुसवा, हुए क्यूँ न गर्क-ए-दरिया
न कभी जनाज़ा उठता, न कहीं मज़ार होता

చచ్చి నేను భ్రష్టునయ్యేకంటే గంగలో కలిసేది మేలు
శవయాత్ర ఉండేది కాదు, నాకు సమాధి మిగిలేది కాదు




Thursday, July 15, 2010

యూరప్ లో వీథులు


The following lines were written by me after my tour to Europe in October 2006. I was highly impressed by the cleanliness and the civic sense of the people of those countries. Contrary to what I often heard and read about the tension, stress and restlessness, I saw people very calm, quite and relaxed in many European cities. It was only in London I observed people hurrying in the streets. Otherwise, they are perfectly at peace with themselves. Also Europeans are known for hiding their feelings in public. On the whole, my opinion about the people of those lands is that they are highly civilized and well-behaved. The architectural marvels they created stand testimony to their genius. Roads and sanitation are the barometers of a community's levels of civilizational refinement. They simply excel in those matters.


యూరపులో ప్రతి వీథి
శశిమండిత నిశీథి
ప్రశాంతతే వాటి నీతి
విను రామన్న!

లండన్ ప్యారిస్ రోములు
నాగరికతలో అగ్రగాములు
ప్రజలంతా సుఖకాములు
విను రామన్న!


స్విట్జార్లాండ్ బజార్లు
వాటి శుభ్రతకు జోహార్లు
శబ్దం చేయవు కార్లు
విను రామన్న!

Wednesday, July 14, 2010

మానసిక వైద్యం హోమియోపతి

మానసిక వైద్యం హోమియోపతి
శాస్త్రీయ మార్గం అలోపతి
మందులులేనిది న్యాచురోపతి
విను రామన్న!

కళ్ళకు ఒచ్చేది రెటినోపతి
మధుమేహానికి న్యూరోపతి
అన్నిట ముందు
ఆఖరి మందు తిరుపతి
విను రామన్న!

Monday, July 12, 2010

సంస్కృతంలేని తెలుగు

సంస్కృతంలేని తెలుగు
మీగడలేని పెరుగు
కుంటివాని పరుగు
విను రామన్న!



సంస్కృత-ద్రవిడ దాంపత్యం
తెలుగుగ పుట్టెను అపత్యం
మన కావ్యాలకిదే నేపథ్యం
విను రామన్న!

తెలుగంటే నాకభిమానం
సంస్కృతం దానికి బహుమానం
రెంటి కలయికే ప్రమాణం
విను రామన్న!


ఉర్దూ నా ప్రేయసీ
ఇంగ్లీషు ఒక ఫ్యాన్టసీ
గీర్వాణం నా మానసీ
విను రామన్న!


పంతులురాని పాఠశాల
మందులులేని వైద్యశాల
సంక్షేమమే దివాలా -
సంక్షేమమేది? ఇవాళ
విను రామన్న!


అన్యాయమే శాశ్వతం
న్యామెపుడూ చంచలం
ఇతిహాసమిదే కలకలం
విను రామన్న!

ఆకాశంలో విమానం
దిగేవరకు అనుమానం
అరచేతుల్లో ప్రాణం
విను రామన్న!

పండ్లలో రాజు మామిడి
"
హిమాయతే ముందు" నానుడి
అమృతానికే అది ప్యారడి
విను రామన్న!
Note: Himayat is the mango variety developed by the aristocracy of Hyderabad in the orchards near Himayat Sagar reservoir. It is known for its fabulous mellow and the spread of its aroma. It looks like the popular 'benishan' but costs two to three times more. Himayat has very thin skin and the stone inside is wafer thin. It is full of muscle and has no fiber. Its taste is indescribable. It is available in Hyderabad in the mid May and the first week of June. Best suited to send as a Gift basket to the near and dear.



అన్నదమ్ముల ప్రేమ
కాలం చెల్లిన డ్రామ
దూరముంటేనె బీమ
విను రామన్న!

వెయ్యేండ్లైనా
వేరు
తప్పదు జ్ఞాతుల పోరు
వేర్పాటిపుడే కోరు
విను రామన్న !

కాలం చెల్లిన ఓదార్పు
కపటం నిండిన ఏడ్పు
వరంగలిచ్చిందే తీర్పు
విను రామన్న!

గైనకాలజ రోగాలు

పుట్టిన ప్రతి జీవికి గిట్టుట అనేది ఖాయం. అసలు ప్రాణీ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని తప్పించుకోలేదు. ప్రతి శరీరము అది ఏనుగులాంటి భారీ కాయమైనా ఒక సూక్ష్మజీవైనా చివరికి శరీరాన్ని వదలవలసిందే. పుట్టడం చావడం ఇవి మన కళ్ళకు కనిపించే సత్యాలు. పుట్టుకకు ముందు ఏమైనా ఉండేదా లేకపోతె మనం పుట్టిన రోజే మన కర్మల ఖాతా మొదలైందా, చచ్చిన తర్వాత ఏమైనా మిగిలి ఉండి, మన బ్యాంక్ ఖాతామాదిరి పాతపాస్ బుక్ పూర్తి అయిన తర్వాత కొత్త పాస్ బుక్ పాత బ్యాలన్స్ తో మళ్ళీ మొదలౌతుందా అనేది వేదాంతపరంగా జిజ్ఞాసువైన మనిషి అడిగే మొదటి ప్రశ్న. శరీరము , శరీరధారి (body and owner of the body) అనేవి రెండు విషయాలా లేక అంతా కలిసి ఒకటేనా అనేది కూడా మొదటి ప్రశ్నకే అనుబంధ ప్రశ్న. "నా ఇల్లు" అన్నప్పుడు ఇక్కడ రెండు వస్తువులు గోచరిస్తాయి. ఒకటి నేను, మరొకటి ఇల్లు. నేను వేరు నా ఇల్లు వేరు. అట్లాగే "నా శరీరం" అన్నప్పుడు కూడా నేను వేరు నా శరీరం వేరు. చాల సులువుగా చిన్నపిల్లలకైన అర్థమయ్యే తులనాత్మక వివరణ (analogy) ఇది. నాకు బాగా అర్థం అయ్యేదీ నేను ఎదుటివారిని ఒప్పించగలిగేది స్పష్టమైన విషయము.

అసలు నేను చెప్పాల్సిన విషయమేమిటంటే జనన మరణ సత్యాల మధ్య జరా అంటే ముసలితనం వ్యాధి అంటే రోగం చాల బాధాకర పరిణామాలు. సాధారణంగా వీటిని దాటిన తర్వాతే శరీరధారులకు మృత్యువు రూపంలో ముక్తి లభిస్తుంది. ఎంత గొప్పయోగి ఆయినా భోగి అయిన ఒకానొకప్పుడు రోగి కావలసిందే. మహా యోగులకు రోగాలు రాకపోవొచ్చు కాని ప్రమాదాలు తప్పవు కదా. స్త్రీలు, పురుషులు, పిల్లలూ అందరూ రోగాల బారిన పడతారు. అయితే మహిళలకు మగవారికుండే రోగాలు, ఇంకా స్త్రీల శరీర ప్రకృతికి సంబంధిచిన విశేష రుగ్మతలు ఎప్పుడూ వెంటాడు తుంటాయి. పాపం ఆడవాళ్ళు గొప్ప సహనశీలులు. వాళ్ళు సమస్యల్ని మగవారి మాదిరిగా అందరికీ విడమరిచి చెప్పనూ లేరు. ఇది ఇంకో సామాజిక సమస్య. ప్రజోత్పత్తికే కారకులైన మాతృమూర్తులను ఎన్నో మరుగు రోగాలు కాలక్రమంలో సతాయిస్తుంటాయి. ఇక స్త్రీవ్యాధుల నిపుణులకు పరిస్థితి పండగలా పరిణమించింది. ప్రతి చిన్న దానికి డాక్టర్ల దగ్గరికి పోవడం వాళ్ళు రకరకాల పరీక్షలపేరుతో భారీ ఫీసులు వసూలు చేయడం మనమందరం చూస్తూనే ఉన్నాము. అసలు కొన్ని జబ్బులకైతే మందు అవసరం ఉండదు. మన తల్లులు వాళ్ళ తల్లులు గైనకాలజిస్టు దగ్గరికి పోయారని.

మధ్య ప్రతి స్త్రీరోగానికి ఒకటే మార్గం సూచిస్తున్నారు కొందరు వైద్యులు. గర్భసంచి తొలిగించడం. ఇది ఒక పెద్ద వైద్య కుంభకోణం గా తయారయింది. మెనోపాజ్ వంటి శరీర సంబంధిత ప్రకృతి మార్పులు అనేవి కాలజాలు అంటే వయసు పెరిగేకొద్దీ సంభవించే పరిణామాలు. ఇతరత్రా సమస్యా లేనప్పుడు శరీరంలోని ఒక భాగాన్ని తీసివేయడం ఒక పెద్ద తప్పిదమే. మధ్య ప్రభుత్వంకూడా కళ్ళు తెరిచింది. గర్భసంచి తొలగించే ఆపరేషన్లు పెద్ద వ్యాపారంగా తయారైనాయని రోజు పేపర్లలో చూస్తున్నాము. కొందరు డాక్టర్ల నీచబుద్ధి వాళ్ళడిగే ప్రశ్నలతో బైటపడుతుంది. మీ వారు ఏమిపని చేస్తారు. వాళ్ళది ప్రైవేటు కంపనీయా గవర్నమెంటుదా? స్టేటా సెంటరా? ఇన్శూరన్స్ ఒస్తుందా? ఇట్లా ప్రశ్నల పరంపర తర్వాత మెల్లిగా చెప్తారు ఖర్చు ప్రొసీజరు మొదలైనవి. గత రెండు సంవత్సారలనుండి నా భార్య పడే బాధలు, వాటికోసం మేము సంప్రదించిన డాక్టర్లను బాగా అర్థం చేసుకొని వాళ్ళ అనైతిక వ్యాపార శైలికి విసిగిపోయి రాసిందే కింది పద్యం. ఇంతకన్నా ఏమిచేయగలము. దయచేసి ఓపికగా చదవండి. మీరూ నాతో ఏకీభవిస్తారు.

మహిళలందు మరుగైనకాలజ రోగాలు
మహిలోని మందులతో మాన్పలేమా? కువైద్యుల
మహిమలే అతివల సుదేహముల జీల్చ
సహనమే సంసారుల వంతు ఆయె!

Friday, July 9, 2010

విశ్వాసానికి ప్రతీక - కుక్క

తెలుగులో ప్రాణిని కుక్క అంటాము, తమిళములో నాయి అంటారు. తెలుగులో మాత్రం పద ప్రయోగం మర్యాదగా ఉంటుంది, ఎందుకో మరి. తమిళంవాళ్ళు 'నాయి' కి ఎలాంటి భావము ఆపాదిస్తారో నాకు తెలియదు. మనవాళ్ళు సాహిత్యంలో కుక్క ప్రస్తావనకు సంస్కృత పదము 'శునకం' వాడుతుంటారు. ఇది సంస్కారవంతమైన ప్రయోగంగా చలామణిలో ఉంది. తెలుగులో నాకు తెలిసినంత వరకు ఒక్క పదమే ఉన్నట్టు తెలుస్తోంది. సంస్కృతంలో కుక్కకు చాల పదాలున్నాయి. ఉదాహరణకు: శ్వా, కుక్కుర, సారమేయ,శునక, కౌలేయక, భషక , మృగదంశక మొదలైనవి. ఇన్ని పర్యాయ పదాలతో సంస్కృతం సుసంపన్నమై ఉన్నది. కుక్క అనే తెలుగు పదము కూడా సంస్కృతపు కుక్కురము నుండే రూపాంతరం చెంది తెలుగులోకి వలస వచ్చినట్టున్నది. ఎందుకంటే, తెలుగుకు మాతృక అయిన తమిళంలోని 'నాయి'కి కుక్కకు శబ్దపరంగా పోలికే లేదు.

ఇంతకూ నేను చెప్పదలిచింది ఏమిటంటే కుక్క అనే ప్రాణి మనషులకు చాలా రకాలుగా మేలుచేస్తున్నది. కుక్కయొక్క విశ్వాసం, విధేయత, దానికున్న ఘ్రాణ, స్మరణ శక్తులు జగద్విదితమైనవే. వాటిని గూర్చి ప్రతి మనసున్న మనిషికి ఎంతో కొంత అనుభవం ఉండే ఉంటుంది. నేను వేరుగా చెప్పనవసరం లేదు. కుక్క మనిషికి ఆది నుండి నమ్మిన బంటులా ఉంది అనడానికి చాల ప్రమాణాలు ఉన్నాయి. ఆది మానవుడు వేటాడే దశలో జీవి మానవునికి చాల సహకరించింది. మహాభారతంలో కూడా మాహా ప్రస్థానంలో కుక్కే పాండవులవెంట చివరిదాకా వెంట నడిచింది. కుక్క ఆదరించిన వాళ్ళను ఎన్నడూ మరవదు. శునకం కూడా మన పిల్లల్లాగే తనను ఇష్టపడే వాళ్ళనే అభిమానిస్తుంది. ఈసడించుకునే వాళ్ళను అసలు లెక్క చేయదు. ఇది నా అనుభవం. కుక్కను పెంచిన, ప్రేమించిన మనిషియొక్క జీవ కారుణ్యగుణం చాల వృద్ధి చెందుతుంది. ఇది పరీక్షించిన సత్యం. అయితే కొన్ని భారతీయేతర సంస్కృతులలో కుక్కను ద్వేషించే కుసంస్కారం పాతుకొని ఉంది. దానికి వాళ్ళు ఇచ్చే వివరణలు చాల హాస్యాస్పదంగా అనైతికంగా ఆహేతుకంగా ఉంటాయి. మా ఇంట్లో ఒక లాబ్రెడార్ బంగారు వర్ణంలో ఉండేది. అది ఇంట్లో ఒక సభ్యునిలా ప్రవర్తించేది. మేము కొత్తగా కట్టిన ఇంట్లోకి మారినప్పుడు ఒకసారి పక్కనే ఖాళీప్లాటుల్లోంచి మా పెరట్లోకి ఒక నాగుపామొస్తే దాన్ని ముఖాముఖి ఎదుర్కొని ఇంట్లోకి రాకుండా చాలాసేపు దాంతో యుద్ధం చేసింది. అలా చేస్తూనే హెచ్చరికగా నిర్విరామంగా మొరుగుతుంటే నేనే వెళ్లి చూసాను. చాల వీరోచితంగా శిక్షణ పొందిన 'జూడో' యోద్ధలా ఎదుర్కొంది నాగరాజును .

మా రుస్తుం (మా కుక్క పేరు) పోయిన తర్వాత మేము ఇంకో కుక్కను తెచ్చి పెంచే ధైర్యం చేయలేదు. కారణం, రుస్తుం తప్పిపోయినప్పుడు మేము పడ్డ క్షోభ చెప్పనలవి కానిది. ఇప్పటికీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఫోటోలలో ఫంక్షన్స్ లో తీసిన వీడియోలు చూసినపుడు చాలా బాధపడతాము. కాబట్టి మేము ఒక వీథి కుక్కకే రోజు పాలు అన్నం పెడతాం. అది సమయానికొచ్చి తిని పోతుంది. మేము లేనప్పుడు ఇంటిని జాగ్రత్తగా కావలికాస్తుంది. చాల తెలివైన కుక్క. దానికి అన్ని మాటలు అర్థం అవుతాయి. మొన్న మేము తిరుపతి వెళ్లి వచ్చాం. మొత్తం బిల్డింగ్ లో ఎవరూ లేరు. మేము ఆటో దిగేసరికి కుక్క పెద్దపులిలా గేట్ లోపల కూర్చొని ఉంది. దాని బాషలో మమ్మల్ని అడిగింది మూడు రోజులూ కనిపించకుండా ఎక్కడిపోయారని . నాలుగు పాదాలు శునకం కోసం ఆశువుగా రాసాను. చూడండి.


శునకమ్మని యీసడించకు
కనకమ్మువలె కాపాడును నిను విశ్వాసముతో;
మనుజులకతినమ్మినబంటు, కు
క్కను చక్కగచూడుము,యిది నిక్కము రామన్న!