తెలుగులో ఆ ప్రాణిని కుక్క అంటాము, తమిళములో నాయి అంటారు. తెలుగులో మాత్రం ఆ పద ప్రయోగం అమర్యాదగా ఉంటుంది, ఎందుకో మరి. తమిళంవాళ్ళు 'నాయి' కి ఎలాంటి భావము ఆపాదిస్తారో నాకు తెలియదు. మనవాళ్ళు సాహిత్యంలో కుక్క ప్రస్తావనకు సంస్కృత పదము 'శునకం' వాడుతుంటారు. ఇది సంస్కారవంతమైన ప్రయోగంగా చలామణిలో ఉంది. తెలుగులో నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క పదమే ఉన్నట్టు తెలుస్తోంది. సంస్కృతంలో కుక్కకు చాల పదాలున్నాయి. ఉదాహరణకు: శ్వా, కుక్కుర, సారమేయ,శునక, కౌలేయక, భషక , మృగదంశక మొదలైనవి. ఇన్ని పర్యాయ పదాలతో సంస్కృతం సుసంపన్నమై ఉన్నది. ఈ కుక్క అనే తెలుగు పదము కూడా సంస్కృతపు కుక్కురము నుండే రూపాంతరం చెంది తెలుగులోకి వలస వచ్చినట్టున్నది. ఎందుకంటే, తెలుగుకు మాతృక అయిన తమిళంలోని 'నాయి'కి కుక్కకు శబ్దపరంగా పోలికే లేదు.
ఇంతకూ నేను చెప్పదలిచింది ఏమిటంటే ఈ కుక్క అనే ప్రాణి మనషులకు చాలా రకాలుగా మేలుచేస్తున్నది. కుక్కయొక్క విశ్వాసం, విధేయత, దానికున్న ఘ్రాణ, స్మరణ శక్తులు జగద్విదితమైనవే. వాటిని గూర్చి ప్రతి మనసున్న మనిషికి ఎంతో కొంత అనుభవం ఉండే ఉంటుంది. నేను వేరుగా చెప్పనవసరం లేదు. కుక్క మనిషికి ఆది నుండి నమ్మిన బంటులా ఉంది అనడానికి చాల ప్రమాణాలు ఉన్నాయి. ఆది మానవుడు వేటాడే దశలో ఈ జీవి మానవునికి చాల సహకరించింది. మహాభారతంలో కూడా మాహా ప్రస్థానంలో కుక్కే పాండవులవెంట చివరిదాకా వెంట నడిచింది. కుక్క ఆదరించిన వాళ్ళను ఎన్నడూ మరవదు. ఈ శునకం కూడా మన పిల్లల్లాగే తనను ఇష్టపడే వాళ్ళనే అభిమానిస్తుంది. ఈసడించుకునే వాళ్ళను అసలు లెక్క చేయదు. ఇది నా అనుభవం. కుక్కను పెంచిన, ప్రేమించిన మనిషియొక్క జీవ కారుణ్యగుణం చాల వృద్ధి చెందుతుంది. ఇది పరీక్షించిన సత్యం. అయితే కొన్ని భారతీయేతర సంస్కృతులలో కుక్కను ద్వేషించే కుసంస్కారం పాతుకొని ఉంది. దానికి వాళ్ళు ఇచ్చే వివరణలు చాల హాస్యాస్పదంగా అనైతికంగా ఆహేతుకంగా ఉంటాయి. మా ఇంట్లో ఒక లాబ్రెడార్ బంగారు వర్ణంలో ఉండేది. అది ఇంట్లో ఒక సభ్యునిలా ప్రవర్తించేది. మేము కొత్తగా కట్టిన ఇంట్లోకి మారినప్పుడు ఒకసారి పక్కనే ఖాళీప్లాటుల్లోంచి మా పెరట్లోకి ఒక నాగుపామొస్తే దాన్ని ముఖాముఖి ఎదుర్కొని ఇంట్లోకి రాకుండా చాలాసేపు దాంతో యుద్ధం చేసింది. అలా చేస్తూనే హెచ్చరికగా నిర్విరామంగా మొరుగుతుంటే నేనే వెళ్లి చూసాను. చాల వీరోచితంగా శిక్షణ పొందిన 'జూడో' యోద్ధలా ఎదుర్కొంది నాగరాజును .
మా రుస్తుం (మా కుక్క పేరు) పోయిన తర్వాత మేము ఇంకో కుక్కను తెచ్చి పెంచే ధైర్యం చేయలేదు. కారణం, రుస్తుం తప్పిపోయినప్పుడు మేము పడ్డ క్షోభ చెప్పనలవి కానిది. ఇప్పటికీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఫోటోలలో ఫంక్షన్స్ లో తీసిన వీడియోలు చూసినపుడు చాలా బాధపడతాము. కాబట్టి మేము ఒక వీథి కుక్కకే రోజు పాలు అన్నం పెడతాం. అది సమయానికొచ్చి తిని పోతుంది. మేము లేనప్పుడు ఇంటిని జాగ్రత్తగా కావలికాస్తుంది. చాల తెలివైన కుక్క. దానికి అన్ని మాటలు అర్థం అవుతాయి. మొన్న మేము తిరుపతి వెళ్లి వచ్చాం. మొత్తం బిల్డింగ్ లో ఎవరూ లేరు. మేము ఆటో దిగేసరికి ఈ కుక్క పెద్దపులిలా గేట్ లోపల కూర్చొని ఉంది. దాని బాషలో మమ్మల్ని అడిగింది ఈ మూడు రోజులూ కనిపించకుండా ఎక్కడిపోయారని . ఈ నాలుగు పాదాలు ఈ శునకం కోసం ఆశువుగా రాసాను. చూడండి.
శునకమ్మని యీసడించకు
కనకమ్మువలె కాపాడును నిను విశ్వాసముతో;
మనుజులకతినమ్మినబంటు, కు
క్కను చక్కగచూడుము,యిది నిక్కము రామన్న!
No comments:
Post a Comment