Tuesday, January 25, 2011

కుల జిజ్ఞాస

కులజిజ్ఞాస
రకరకాల ప్రశ్నలు. బ్రహ్మజిజ్ఞాసువులవలె ఏవేవో అప్రస్తుతమైన విచారణలు. ఆ ప్రచ్చన్న పదార్ధం ఆవిష్కరించబడే వరకు వారు ఎన్ని విచిత్రమైన విషయాలడుగుతారో అవి ప్రత్యక్షంగా అనుభవిస్తేనే ఆనందం.

నేను నా జీవితంలో చాల విచిత్రమైన విలక్షణమైన మనుషులను, విశిష్టమైన శేముషీ వైభవము గల విచక్షణా పరులను చూసాను, వారితో మాట్లాడే అవకాశం కూడా లభించింది. జ్ఞాన విజ్ఞాన పీఠాలకు వన్నె తెచ్చిన మహానుభావులతో కూడా కలిసి మాట్లాడే అదృష్టం నాకు దొరికింది. నాకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప వాళ్ళను దర్శించుకునే అలవాటు చిన్నపట్నుంచి ఉంది. ఎందుకంటే "సతాం సకృత్ సంగమమీప్సితం పరం" అనే ఆర్యోక్తి నాలో వేళ్ళూరుకొని ఉంది . అయితే నన్నెవరూ నీ కులమేమిటి అని ఎన్నడు ప్రశ్నించ లేదు . అసలా ప్రస్తావనే నాకు ఎన్నడు తారస పడ లేదు. సత్పురుషులకు కులాల సంకుచిత్వం అస్పృశ్యం. మా హైదరాబాద్ సంస్కృతిలో ఇదొక భాగం. కులాల విషయం ఎవరూ అంత పట్టించుకోరు. ఆ ప్రస్తావనే రాదు. నాకు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మొదటి సారి హైదరాబాద్ విడిచి ఇంకో ఊరికి, కొలువు బదిలీ అయితే పోవడం జరిగింది. అక్కడ తెలిసింది కులమంటే ఏమిటి దానికున్న ప్రాధాన్యత ఎంత అని; ఎదుటి వాని కులం గురించి తెలుసుకోవడం కోసం ప్రజలు ఎందుకు అంత తహతహ లాడుతుంటారు అని. నేను కులాల కుళ్ళును చూసింది గుంటూరు లోనే. నేను ఇంటికోసం ఒక చోట మాట్లాడుతుంటే ఒక గొప్ప పదబంధం వినిపించింది. "మీరేమిట్లు?" నాకేమి అర్థం కాలేదు. మొదట ఏదో 'అట్ల' గురించి మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషి అనుకున్న. విషయం తెలిసిన తర్వాత చాల నవ్వుకున్న.

1985-86లో గుంటూరులో నేనొక ఇంట్లో కిరాయికి ఉండే వాణ్ని. పక్క పోర్షన్లో యజమాని ఉండే వాడు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేది. ఒక రోజు మీ కుక్క పేరు ఏమిటి అని అడిగాను. వెంటనే, అతి ఉత్సాహంతో "చిరంజీవి" అన్నాడు. నేను గొప్పగా స్పందించలేదు. కారణం, నాకు సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు చూసే 'శౌక్' లేదు. నాలో విశేషమైన ప్రతిక్రియ ఏది కనపడకపోయే సరికి అతనే విడమరిచి చెప్పాడు, ఆ పేరు ఎవరిని ఉద్దేశించి పెట్టబడిందని. నేను అవాక్కైపోయాను. ఇంత వైషమ్య-ద్వేషమా ఇతరుల కులాలపట్ల!

ప్రస్తుతమున్న మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో నా అనుభవం ప్రకారం కోస్తాఆంధ్రలోనే కులాల గురించి అప్రస్తుతంగా అమర్యాదగా అడిగి తెలుసుకునే కుసంస్కారముంది. ఆ ఎరుక కోసం వాళ్ళడిగే ప్రశ్నలు చాల గమ్మత్తుగ వ్యంగ్యంగా ప్రచ్చన్నంగా పరోక్షంగా ఉంటాయి. సంధించబడ్డ ప్రశ్నలన్నీ ఏ పరమార్థం కోసమో తెలుస్తూనే ఉంటుంది. నేను పని చేసే ఆఫీసులో నా కులం తెలుసుకోడానికి, చాల కష్టపడ్డారు. ఆ ప్రాంతం వాళ్ళ కులాల గూళ్ళలో నేను ఎక్కడా 'ఫిట్' కాకపోయే సరికి నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే అది ఇపుడు మారిందేమో. నేను చూసిన ఆంధ్ర (1985 నుండి 1999) ఇప్పుడు మారేవుంటుంది. కులాల కుళ్ళు-కుమ్ములాటల యదార్థాలను సాక్షి రూపంగా ఈ రెండు పద్యాల్లో బంధించాను. ఇది నా వ్యక్తిగత అనుభావాల సారం మాత్రమే. ఇది పూర్ణ సత్యం కాకపోవొచ్చు. పరీక్షించండి.

కమ్మ శర్మ శెట్టి వర్మలు, అతి
నెమ్మదిగా కులమడిగి, తమ
కొమ్మ కాదని ఎరిగి విరిగిన
బొమ్మలా విసిరేతురు వినురామన్న!


కులమునకు మరుగుమాట సామాజికవర్గం
బలమునుంచి పుట్టు ఆట పోలింగు-రంగం
కలములందు పొంచియుండు 'ఇజముల'దుర్గం
విలువలెపుడు వీడవలదు మానవ సర్గం

No comments:

Post a Comment