మీసంతో పని ఏమి ఇలలో మగధీరులకు?
వీసంతో కొలుతురా వినీలాకాశం? ముఖవి
లాసమే మగువలకు మక్కువైయుండ, యీ మొ
గసాల ఎందుకో వీరులకు శూరులకు?
మీసాల మీద ఒక చర్చ. చాల మజేదార్ ముచ్చట ఇది. నాకు చాల ఇష్టమైన విషయం. బుద్ధి తెలిసినప్పటినుంచి ఎంతో మందితో చాల సార్లు రచ్చరచ్చగా చర్చించిన. కొందరైతే నారాజ్ అయిండ్రు. గమ్మత్తు కోసమే అనుకోండ్రి. నన్నెవ్వరు మెప్పించలేక పోయిండ్రు। అసలు మగ మానవుడికి పై పెదవి మీద ఉండే వెంట్రుకలే గుర్తా మగతనానికి? ముక్కుక్రింద వెంట్రుకల వరస, కట్ట, కొందరు ఆంద్ర హీరోలు పెట్టుకునే ఒక సన్న గీత, హిట్లర్ లాంటి కందిరీగ మీసం, అచ్చం ఈగవాలినట్టు వెంట్రుకలు మూతిమీద ఉంటేనే మగవాల్లలాగా చెల్లుతరా? అసలేంది యీ మీసాల కథ? వాటి అవసరం ఉందా మనుషులకు. మీసాలు లేకుంటే ఏమవుతుంది? మనం పుట్టినప్పుడు మనకు మీసాలు లేవు కదా. దేవుడు మనకు నెత్తి మీద వెంట్రుకలిచ్చిండు. నెత్తికి రక్షణ లెక్క: గర్మీ ని పట్టి ఉంచుతందుకు. సర్ది నుంచి కాపడేతందుకు. ఏమన్నా దెబ్బలు తాకితే బచాయిస్తందుకు. భూమి మీది ప్రాణులందరికి వాటి వాటి అవసరాలకనుగుణంగా ప్రకృతి యీ కేశసంపదను ప్రసాదించింది. కాని, మానవులకు పుట్టినప్పుడు తల, కనుబొమ్మలు తప్ప, ఇంకెక్కడా వెంట్రుకలు ప్రకృతి ఇవ్వలేదు కదా.శిరోజాలు కనుబొమ్మల కేశాలు మాత్రమే సహజాలు. అంటే మనతో పాటు పుట్టినవి. సన్నని రోమాలు ఉంటాయి కాని అవి మనకు కన్పించవు. మనిషి పెయ్యి మీద అలగ్ అలగ్ జాగలల్ల మొలిచే కేశాలన్నీ తర్వాత ఉమర్ పెరిగేకొద్దీ ఒచ్చే వికారాలు మాత్రమే.
వెంట్రుకలకు అవి పెరిగే జాగనుబట్టి అలగ్ అలగ్ పేర్లు ఉంటై. మనం ఆ వివరాలల్లకు పోవొద్దు. నెత్తి మీద ఉన్న వెంట్రుకలు మాత్రమే మానవులందరికీ అంటే స్త్రీపురుషులకు పిల్లలకు పెద్దలకు అందాన్ని ప్రసాదిస్తాయి. దేవీ దేవతలకున్న పేర్లను పరిశీలిస్తే మనకే తెలుస్తుంది. కేశవ, కేశిని, బాలకృష్ణ (అందమైన బాల్ ఉన్న కృష్ణుడు, చిన్న కృష్ణుడు), కపర్దిని, సుకేశి, కృష్ణవేణి, ఝఠాధర్, నాగవేణి వగైరాలన్నీ తల మీద ఉన్న కేశ సౌందర్యాన్ని సూచిస్తున్నాయి. మీసాలు గడ్డాలు ఉన్న వ్యక్తిని ఎవరైనా పొగిడినట్టు నాకు తెలియదు. ఇక కేశసౌందర్యాలను కవులు ముఖ్యంగా ఉర్దూ కవులు వారి వారి రచనల్లో బాగా వాడుకున్నారు. ప్రేయసి, కథానాయిక వర్ణనలన్నీ కురుల వర్ణనలతో (రేశ్మీ జుల్ఫే) నిండి ఉంటాయి. జుల్ఫ్ ను (ప్రేయసి కేశాలను) రమ్యాతిరమ్యంగా ముగ్ధమనోహరంగా వర్ణించడంలో ఉర్దూ కవులకు ఎవరూ సాటి రారు. ఇది నా అచంచల అభిప్రాయం. ఇటీవలి తెలుగు కవితల్లో ".. ఆ కురులు ఇంద్రనీలాల వనులు ...." అని ఇద్దరు కవులు దాదాపు ఒకే సారి రాసుకున్నారు. ఎవరిది ఎవరు కాపి కొట్టారో, లేకపోతె ఈ అద్భుత భావచిత్ర పదబంధం ఇద్దరికీ సమకాలంలో స్ఫురించిందో వాళ్ళే తేల్చుకోవాలి. లోపలి విషయం కొంత తెలిసింది, ఇద్దరు ఫోన్లో తిట్టుకున్నారని. జీవనోపాది కోసం, కేవలం పేరు ప్రతిష్టల కోసం రాసే కవులు, రచయితలూ, కళాకారులందరూ పుస్తకాల్లో ప్రదర్శనల్లో మాత్రమే గొప్పగా దర్శనమిస్తారు. వారిని అట్లా చూస్తేనే బాగుంటుంది. ఇది నా అనుభవం.
ఆది మానవుడు వానికి క్షవరం చేసుకోవడం తెలియకపోవడం చేత జులుపాలు, గడ్డాలు పెంచేవాడు. వాడు కొంచెం బుద్ధి పెంచుకున్న తర్వాత చిప్పలతో క్షవరం చేసుకున్నాడట. తర్వాత లోహాలు కనిపెట్టినంక తేజ్ హత్యార్లు ఔజార్లు తయార్చేస్కోని షికార్ చేయడం కోసం, యుద్దాలకోసం, చివరికి వెంట్రుకల కత్తిరించడం కోసం వాడిన్డు. అట్లా మనిషి సంస్కారాలు నేర్చుకున్నడు. ఇపుడు క్షవరం ఒక సౌందర్యపరిశ్రమ. పుట్టుకతో ఎవనికి ఏది రాదు. మనమున్న సమాజము, మన కుటుంబము, పరిసరాలు పరిస్థితులే మనని తయారు చేస్తయి. పుట్టుక గొప్పనా లేక పరిసారాల ప్రభావం గొప్పన అనేది ఒక మంచి చర్చ.
మనం దారి తప్పుతున్నం. మన విషయం మీసాలు, గడ్డాలు. ముఖం మీద గడ్డం మీసం ఉంటెనే మొగోడా. లేకపోతె కాడా. కొందరైతే మీసాల పొడువుకు మగసిరికి సంబంధమున్నట్టు మీసాలు పెంచుతరు. ఇదంతా ఒట్టి గప్పాలు కొట్టడమే. నిజంగా చెప్పాలంటే సాధారణంగా ఆడవాళ్ళకు మీసాలంటే కోపం నఫ్రత్ కూడా. ప్రతి భార్య తన భర్త 'చిక్నా' గ ఉండాలని అనుకుంటరు. నాకయితే (పెద్ద) మీసాలు దురహంకారానికి, దౌర్జన్యానికి, క్రూరత్వానికి ప్రతీకలనిపిస్తాయి. బుద్ధిజీవిగా (intellectual), అభ్యుదయ భావాలుగల వానిగా, సైంటిస్టుగా చలామణి కావడానికి రకరకాల గడ్డాలు పెంచుతుంటారు. నా ప్రకారం, బద్ధకం ఈ మీసాల-గడ్డాల పెంపకానికి మూల కారణం. మిలిటరీ, పోలిసోల్లు మీసాలు పెంచడానికి వేరే కారణాలున్నయి. వాళ్ళను మాఫ్ చేద్దాం. సాఫ్ సుత్రగా ఉండడమే సుసంస్కారం. ఇది నా అభిప్రాయం.
Hair care and hair dressing, in my opinion, is an important stage in the evolution of human race and marks a defining aspect of civilization. Since there is no case for leaving the hair unkempt and unshaven, there is no use for any hair other than that accompanied us since our birth. Any argument against clean face and well-groomed hair is feeble and indefensible.
No comments:
Post a Comment