ఈ షేర్లో గాలిబ్ రసముయొక్క, ఆ మాటకొస్తే కవితాతత్త్వము యొక్క ఉత్తమ స్వరూపాన్ని నిక్షిప్తం చేశాడు. ఈ షేర్ మననం చేసుకుంటే కవికుల గురువు జ్ఞప్తి కొస్తున్నాడు.అభిజ్ఞాన శాకుంతలంలోని "రమ్యాణి వీక్ష్య" శ్లోకం నా మదిలో కదులుతున్నది. అక్కడ కాళిదాసుని నాయకుడు రమ్యమైన వస్తువులను చూచి, మధురమైన శబ్దములను విని, సుఖంగా ఉన్నవాడు పర్యుత్స్కుడవుతున్నాడు, అంటే, అలజడి, అశాంతికి లోనవుతున్నాడు. ఇక్కడ, అనారోగ్యంగా ఉన్న వాడు ప్రియురాలి దృష్టి పడగానే స్వస్థతను పొందినట్టు నాయికకు గోచరిస్తున్నాడు. ఇదే తేడా. అయితే చమత్కృతిలో మాత్రం పూర్ణ సామ్యం కనబడుతున్నది. పర్యవసానం, ఇద్దరూ సౌఖ్యానికి దూరమయ్యారు. ఏదో పోగుటుకున్న వారిలా వాంచా లక్షణాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కవితను షేర్-శిరోమణి గా పరిగణించడం అసమంజసం కాదు.
No comments:
Post a Comment