Saturday, June 26, 2010
ఈ నెలంతా (మే , జూన్ ) దేశంలో గృహిణులు నానా ఇబ్బందులు పడి పచ్చళ్ళు పెట్టారు. ఈ పచ్చళ్ళ గురించి కొంత చర్చ జరపొచ్చు. అసలు మొత్తం ఉపఖండమే పచ్చళ్ళకు బాగా అలవాటై ఉన్నది. ఇక దీని కూర్పులో ఉన్నంత వైవిధ్యం బహుశా ఇంకే వ్యంజనము, వంటకములో ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. మొదట ఈ వ్యంజనం పేర్ల గురించి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే పచ్చళ్ళకు చాల పేర్లు ఉన్నాయి . ఆంధ్రలో ఆవకాయ పచ్చడి, తెలంగాణాలో మామిడికాయతొక్కు, కారాలు, ఊరగాయలు, ఇంకా కర్నూలు ప్రాంతంలో ఊర్మిండి అని వివిధ రకాల పేర్లున్నాయి. ఉత్తర భారతంలో కూడా అనేక రకాలుగా పచ్చళ్ళను వాడతారు. "అచార్" అనే పేరు మాత్రం చాల ప్రాంతాల్లో వినిపిస్తుంది. మే జూన్ నెలల్లో ఈ పచ్చడ్ల తయారికి మన ఇళ్లలో మహిళలు శ్రమ పడి రక రకాలుగా దినుసులు తయారు చేస్తారు. ఈ రోజుల్లో మాత్రం చాల మంది రెడీమేడు మసాలాల్నే వాడుతున్నారు. అయితే ఇంకా చాల ఇళ్ళలో ఈ దినుసులను స్వంతంగా తాయారు చేసుకొని పచ్చళ్ళను కలుపుతారు. మామిడి తొక్కు తయారుచేయడాన్ని కలపడం, పెట్టడం, వేయడం అనే క్రియారూపాలను వాడుతుంటారు. వీటి తయారీలో పెద్దవారి పాత్ర అధికం. వయసు మళ్ళిన అనుభవజ్ఞులైన నాయనమ్మలు , అమ్మమ్మలు వదినలు ఆడపడచులు చాల సలహాలు రెడి గా అందిస్తుంటారు. వీరందరి సలహా లేనిది అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తి కానే కాదు. ఈ మహా వ్యంజనం కూర్పులో వారి మార్గదర్శనం అనివార్యం కూడా.
ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే ఈ పచ్చళ్ళను చాల పవిత్రతతో శుద్ధిగా శ్రద్ధగా భక్తిభావంతో మడి కట్టుకొని ముడతారు. మర్తబాన్ అంటే పింగాణి జాడీలు వీటికి అనువైనయని అందరికి తెలుసు. చాల ఇళ్ళలో పచ్చళ్ళ జాడీలను పూజా రూముల్లోనే భద్రపరుస్తారు . ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరిగే తంతును నేను చిన్నపట్నుంచి గమనిస్తున్నాను. ఉమ్మడి కుటుంబాల్లో ఈ ప్రక్రియ ఒక క్రతువులా చేసేవారు. ఇప్పుడు విడిపోయిన చిన్న సైజు కుటుంబాల్లో కూడా ఎంతో కొంత ఈ పచ్చళ్ళ తయారి కొనసాగుతూనే ఉంది. బజారులో అనేక రకాల పచ్చళ్ళు తయ్యారుగా దొరుకుతున్న ఈ రోజుల్లో మన ఆడవాళ్ళు ఎంతోకొంత ఇంట్లోనే తయారు చేయడం ఒక మంచి సంప్రదాయం. ఇది నిరంతరం కొనసాగాగుతుందని ఆశిద్దాం. ఈ మామిడి కాయ తొక్కుల తయారికి మా ఇంట్లో జరిగే హడావిడికి స్పందించి రాసినవే ఈ క్రింది మూడు పద్యాలు. భోజనప్రియులు చదివి ఆనందించండి.
అవనిలోని అన్నకళలలో మిన్నయి
ఆవకాయ కూర్పు అవతరించె ; భూ
ధవులను నిర్ధనులను సమముగా
సేవించు ఈ వ్యంజనమే గొప్ప విను రామన్న!
కాయ ఎంపికతో మొదలైన కారంఘాటు, వా
ళ్ళాయన్ను ఒప్పించి వారం పాటు; పెట్టె
నయ ఇంగువావ-వెల్లుల్లి పోపుల పోటు, ఆవ
కాయుంటే వంటింట్లో ఉండదు లోటు!
ఇంటికో రుచి యుండు మామిడి తొక్కు
పంటికో రుచినిచ్చు కారం-కిక్కు; తెలు-
గింటికే వన్నె తెచ్చు ఆవ గిమిక్కు, మా
ఒంటికే పడదాయె ఏమి లక్కు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment