అసదుల్లః ఖాన్ గాలిబ్ గురించి బహుశ తెలియని వారుండరు మన దేశంలో. ముఖ్యంగా తెలంగాణాలో ఇంకాముఖ్యంగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారు ఎవరైనా సరే వాళ్ళ మాతృభాష ఏదైనా సరే వారికి సాహిత్యంలో ప్రవేశంఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబ్ గురించి తప్పకుండ అప్రయత్నంగానైనా వినే ఉంటారు. ఏదో ఒక కవిత గాలిబ్ దో లేకపోతె గాలిబ్ పేరున చెప్పిందో వినే ఉంటారు. అర్థం అయినా కాకపోయినా 'వాహ్ క్యా బాత్ హై' అని స్పందిచేఉంటారు. ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదు. హైదరాబాద్ సంస్కృతి చాల విలక్షణమైనది. ఇక్కడివారు ఇంట్లోమాట్లాడేభాష ఏదైనాకాని వాళ్ళు ఇంటిబయట వాడుకునే 'మాట' భిన్నంగా ఉంటుంది. ఉర్దూ తో ఉన్న అనుబంధం మూలాన ఇక్కడి భాష చాలా సంపన్నమైనదనే చెప్పాలి. ఉర్దూ ద్వారా ఎన్నో తుర్కి, పార్సీ, అరబ్బీ పదాలు తెలుగు లోకి చేరిపోయాయి. సంస్కృతం తర్వాత ఉర్దూ పదాలే తెలుగులో గుర్తు పట్టలేనంతగా మిలితమైపోయాయి. ఉర్దూ క్రియారూపాలు తెలిగించబడి తెలగాణ్యుల భాషలో ఏ రకంగా మమేకం పొందాయి అనేది పరిశోధనకు సామగ్రి. ఉదాహరణకు: గుసాయిస్తున్నాడు (దూరుతున్నాడు) , సతాయిస్తున్నాడు (వేధిస్తున్నాడు) , అక్డాయిస్తున్నాడు(విర్రవీగుతున్నాడు), రొకాయిస్తున్నాడు(అడ్డువేస్తున్నాడు). ఇవన్నీ తద్భవాలయ్యాయి. అదే విధంగా ఎన్నో నామవాచకాలు కూడా తెలుగు భాష, సంస్కృతులలో అంతర్భాగామైనవి. అయితే ఒక మాట చెప్పుకోవాలి. కోస్తాలో మాట్లాడే, రాసే భాషలో కూడా, లెక్కలేనన్ని ఉర్దూ పదాలున్నాయి. అయితే వారు అవి తెలుగు పదాలే అనుకుంటారు. తెలియక వాటిని అపార్థాలు వచ్చేటట్టు ప్రయోగిస్తారు. ఉదాహరణకు, ఖూని అనే పదము. ఖూన్ అంటే రక్తము. ఖతల్/ఖూన్ అంటే హత్య. ఖాతిల్/ఖూని అంటే హంతకుడు. తెలియక, కోస్తా వారు 'ఖూని' అని హత్యకు బదులుగా వాడుకుంటారు. అట్లాగే ముద్దాయి అనే ఫార్సీ పదము. ముద్దాయి అంటే ఫిర్యాదు చేయువాడు plantiff. సినిమాల వాళ్ళు, పత్రికల వాళ్ళు ఆ పదం నిందితునికి (accused) పర్యాయ పదంగా వాడుతున్నారు. మనము వాడే చిరునామా (address) అని వాడే పదము కూడా ఫార్సీ పదమేనని కొందరికే తెలుసు. ఇంకొక విషయం. తిరుమలలోని ఎన్నో తంతులకు, అధికార కార్యక్రమాలకు నేటికీ ఫార్సీ/అరబ్బీ పదాలు వాడుతున్నారు. ఉదాహరణకు: ఇస్తాక్ఫాల్ (స్వాగతం), పేష్కర్, మిరాసిదారు ఇత్యాది.
మన పత్రికల నుండి కవితా, కావ్యాల్లోంచి సంస్కృతం ఉర్దూ పదాలు ఏరి వేస్తె మిగిలేది గందరగోళం. ఒక సారి ప్రయత్నించండి. అయితే మీకు ఏ పదము తెలుగు కాదో తెలియాలి. అప్పుడు తెలుస్తుంది మనము తెలుగు అని పిలిచే భాష ఏ రకంగా సంస్కృతం, ఉర్దూ (ఫార్సీ/అరబ్బీ/తుర్కి), భాషలతో సుసంపన్నమైయుండి తన ద్రవిడ స్వరూపానికి చాలా దూరమై యున్నదనే సత్యం. మనం ప్రస్తుతం వాడే తెలుగు, ద్రవిడ ఆస్థిపంజరంపై సంస్కృత, ఉర్దూ పదజాలంతో అలంకృత అయిన ఒక మిశ్రమభాష. ఇంత ఎందుకు చెప్పుతున్నానంటే, గాలిబ్ని తెలుగులోకి తేవాలని నేను సంకల్పం చేసినపుడు భాష స్వరూపం గూర్చి చాల ఆలోచించాను. అయినంత వరకు సంస్కృత పదముల వాడుక తగ్గేట్టు చూచాను. అది సాధ్యం కాలేదనే చెప్పాలి. గాలిబ్ లాంటి నిగూఢ, మార్మిక, దార్శనిక, చమత్కారభరితమైన కవితల్నిసంస్కృతంపై ఆధారపడకుండా అనువదించడం ఆకల్పనీయం. తెలుగుకు మాతృక ఆయిన తమిళంలో సాధ్యమేమో, నాకు తెలియదు.
దీవాన్-ఎ-గాలిబ్ చదివాను. నాకు కూడా గాలిబ్ ని తర్జుమా చేయాలని కోరిక పుట్టింది. దీవాన్ అంటే ఒక కవి ప్రచురించిన తన కవితల సంపుటి (an anthology). తెలుగు సాహిత్యకారులకు గాలిబ్ సాహితీ సౌరాభాలు అంతగా చేరలేదనే నేననుకుంటాను. ఎందుకంటే, నా ఎరుకలో గాలిబ్ ని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసినవారు చాలా అరుదు. యాబై ఏళ్ళక్రితం ఒక ప్రయత్నం జరిగింది. అంటే ఆ తరువాత ఎవరూ అంతగా గాలిబ్ విషయాని పట్టించుకున్నట్టు లేదు.
అసలీ గాలిబ్ ఎవరు. ఎక్కడి వాడు. అతనికి ఉర్దూ సాహిత్యంలో ఇంత ఉన్నత స్థానం ఎందుకుంది అనే ప్రశ్నలకు జవాబు చాల మందికి తెలిసే ఉంటుందని నా నమ్మకం. ప్రచార సాధనాలు, ముఖ్యంగా టెలివిషన్ ద్వారా, సినిమాల ద్వారా గాలిబ్ పరిచయమయ్యాడు. గుల్జార్ కృషి పుణ్యాన మనమందరమూ జగ్జిత్ సింగ్ నోట గాలిబ్ గజల్లు విని ఆనందిస్తాము.గాలిబ్ పుట్టు పూర్వోత్తరాలు పక్కన పెట్టి మనం ఆయన రచనా కౌశలం గూర్చి చర్చిద్దాం.గాలిబ్ ఒక అసాధారణ వ్యక్తిత్వమున్న కవి. గాలిబ్ కవితల్లో ముఖ్యంగా శృంగార రసం ఉట్టిపడుతున్నట్టే ఉంటుంది. కాని, గాలిబ్ ది విలక్షణమయిన శైలి. ఆతను మాట్లాడినా రాసినా, బహ్వర్థాలు ధ్వనిస్తాయి. ఉర్దూ సంప్రదాయంలో కవితను రాయడం అనరు. కవిత్వం చెప్పడమనే (షేర్ కహ్నా) అంటారు. ఎందుకంటే, ఉర్దూ సాహితీ సంప్రదాయం ప్రకారం, మొదట కవి తన కవితను కవిసమ్మేళనంలో (ముషాయెరలో) వినిపిస్తాడు. అక్కడ మెప్పు పొంది, ఆ తర్వాత పుస్తక రూపంలో వస్తుంది కవిత.
వాచ్య వ్యంగ్యాలతో చదువరులను ఆకట్టుకుంటాయి గాలిబ్ షేర్లు. వాడిన ప్రతి పదము, పదబంధము భావగర్భితంగా ఉండి శ్రోతని నిలిపి ఆలోచింప చేస్తాయి. ఆయన దీవాన్ లోని మొట్టమొదటి కవితలో అర్థమే లేదని వాదించారట, సమకాలీన కవులు విమర్శకులు, అర్థం కాక. గాలిబ్ ను కొందరయితే బ్రతిమాలారు, తేలికయిన పదాలు వాడమని. కాని గాలిబ్ దేనికి ఒప్పుకోలేదు. గుండెను గుద్దే గంభీర గాథను గరిమాన్విత వాగ్జాలంలో చెప్పే సుకవి గాలిబ్. ఆయన పదచయనశేముషీ అనన్యాదృశమని గాలిబ్-పండితుల అభిప్రాయం. సుదీర్ఘ ఫార్సీ సమాసాల ప్రయోగం గాలిబ్ కు వెన్నతో పెట్టిన విద్య, అలంకారశాస్త్రంలో ఆరితేరిన నిష్ణాతుడు. గాలిబ్ గొప్ప మానవతావాది. కవిత్వం ఒక సంవేదన, ఒక ఆవేశం. సకల దేశకాల పరిస్థితుల్లో, యిది ఉత్తమ కవిత్వానికి అనివార్యం. దు:ఖానికి ఆవేదనకు అన్యాయానికి స్పందించడం వల్లే మహాకావ్యాలు పుట్టాయి. సంవేదనాశీలతను, రక్తాన్ని ప్రతీకగా చూపి గాలిబ్ ఎలా ప్రతిష్టిస్తాడో ఈ షేర్లో పరిశీలించండి. "ధమనుల్లో పరుగెత్తడం ఏముంది అందు గొప్పతనం; కళ్ళనుండి రాలనపుడు రక్తమెట్లవును సార్థకం" .పుట్టింది పెరిగింది ముస్లిం కుటుంబంలోనే అయినా, మత ఛాందస భావాలకు ఎప్పుడూ తలొగ్గలేదు. చూడండి: "మసీదు ఛాయల్లో వెలయాలి మధుశాల కనుబొమల క్రిందే కాంక్షలు తీర్చే శ్రీశాల' ఎంత వివాదాస్పదుడో గాలిబ్. 'ఛాందస కర్మల త్యజనమే మా మతం' అంటాడు. ప్రతి ముస్లింకు అంతిమ గమ్య స్థానమయిన జన్నత్ (స్వర్గం) కూడా అక్కడి భోగభాగ్యాల ప్రలోభాలతో గాలిబ్ నమ్మిన సార్వలౌకిక దృక్పథం నుంచి అతన్ని మరల్చలేక పోయింది. కారణం, గాలిబ్ కుహన లౌకికవాది కాదు. జన్నత్ సత్యాలు అతను బాగా ఎరుగునట. "మేమెరుగుదుము ఆ జన్నత్ లోని వాస్తవాలు అయినా, మనసును సుఖపెట్టేందుకు బావుంది ఈ భావన" అని జన్నత్ ని తేలికగా తేల్చేస్తాడు.
సంభాషణ కూడా చాల రమ్యంగా శ్లేషపూరిత ఛలోక్తులతో కొనసాగించే వాడు గాలిబ్. ఒకసారి రంజాన్ మాసం లో చివరి మొఘల్ చక్రవర్తి, బహదూర్ షా జఫర్, అడిగాడట: ఉపవాసాలన్నీ ఉన్నారా ? అని. దానికి "ఒక్కటి ఉండలేదు" అని బదులిచ్చాడట మన గాలిబ్. చక్రవర్తి ఏమర్థం చేసుకున్నాడు, ఒక్కటి మాత్రం ఉండలేకపోయాడు అని. ఆ జవాబులో శ్లేష ఉంది. ఇంకో రకంగా, అసలు ఒక్కటి కూడా ఉండలేదని ధ్వని. ఇల్లాంటివి కొల్లలు కొల్లలు గా ఉన్నాయి గాలిబ్ చమత్కార సంభాషణా సందర్భాలు.
ఆయనది రాచరిక సంబంధాలున్న వంశవృక్షమని చెప్పుకున్నాడు.కాబట్టి, అవసాన దశవరకూ యా ఠీవిని బద్రపరచుకునేందుకు అతి దుర్బర దారిద్ర్యంలో కూడా ఆరాటపడ్డాడు. తన మర్యాదకు భంగం కలిగించే ఏ పదవులకోసం సన్మానసత్కారాలకోసం ఆయన వెంపర్లాడలేదు, పైరవీలు చేసుకోలేదు. అయితే, గాలిబ్ ని వెంటాడిన వ్యసనాల మూలాన, చాల అవమానాలకు గురయ్యాడు. చివరికి కారాగారానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది.
గాలిబ్ రాసిందంతా విశ్వజనీన విషయ ప్రతిపాదనే మరోటి కాదు. ఆయనది సూఫీమార్గం. భగవంతుణ్ణి ప్రియురాలిగా/ప్రియునిగా భావించి, అట్లానే సంబోధించి యౌగిక సంబంధమేర్పరుచుకొనడమే సూఫీ వాదంలోని నిరంతర తపన. అది ఆశిక్షితులకు లౌకిక అనురాగంలానే గోచరించవచ్చు. కాని లోతుగా పరిశీలిస్తే దాదాపు ప్రతి వాక్యం లో రూఢ్యర్థం, యౌగికార్థం రెండూ నిక్షిప్తమై ఉంటాయి. తన భావాన్ని రకరకాల ఉపమానాలతో, అతిశయోక్తులతో, అందమయిన పునరుక్తులతో విభిన్న వృత్తాలలో అభివ్యక్తీకరించి ద్రష్టగా దర్శనమిచ్చే మహాకవి గాలిబ్. గాలిబ్ మనకు ఫక్తు అద్వైతవేదాంతిలా అడుగడునా అగుపిస్తాడు. 'ద్రష్ట, దర్శనం, దర్శితం అన్నిటి మూలమొక్కటే' అంటాడు. 'బిందువుకు సింధువులో విలీనమే ఆనందం' అని ఉపనిషద్ఘోషితమయిన సాయుజ్యాన్ని ఉద్బోధిస్తాడు. వేదాంత సూత్రాలలోని ప్రథమ సూత్రాన్ని పోలిన భావంతో తన దీవాన్ ను జిజ్ఞాసతోనే ప్రారంభిస్తాడు. "ఎవ్వని విలాసకేళి" ఈ జగద్రచన అని ప్రశ్నించే జిజ్ఞాసువు గాలిబ్. చివరికి, ఈ ప్రపంచం చిన్నారుల ఆట స్థలం లాంటిదేనని, జగమంతా ఒక నాటకమని మాయావాదాన్ని వినిపిస్తాడు.
ఇంకా ఏవేవో ఫారసీక సాహిత్య పోకడలతో ప్రయోగాలు చేస్తాడు. రెండు పాదాల ద్విపద పరిధి లోనే భావాన్ని రసాత్మకంగా చిత్రీకరించి చమత్కారంతో ముగిస్తాడు. ఆ చమత్కృతి ధ్వన్యాత్మకంగా వాచ్యార్థాంతర భావాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రతి ఒక్క షేర్ (ద్విపద అయిన చమత్కవిత) స్వతంత్రంగా ఉండి, సంపూర్ణ భావాన్ని అందజేస్తుంది. షేర్ అని పిలవబడే ద్విపద మన చాటు పద్యం లాంటిదే. ఒక గజల్ లో పది వరకు ఈ షేర్లు ఉంటాయి. దేనికదే పూర్ణ భావార్థ ప్రదీపిక.
గాలిబ్ రచించిన ఉత్తరాలకు ఉర్దూ సాహిత్యంలో విశిష్ట స్థానముంది. ఉత్తరరచన అనేది ఒక నిర్దిష్టమయిన సాహితీ ప్రక్రియగా అవతరించడానికి గాలిబ్ ఉత్తరప్రత్యుత్తరాలలో వాడిన ఇదివరకెరుగని శైలి, కథనకౌశలాలె కారణమని పండితుల అభిప్రాయం. సత్కార బహుమానలకోసం కవిత చెప్పనని వెల్లడించుకొని కూడా, నవాబులను శ్రీమంతులను ఉద్దేశించి గొప్ప గొప్ప ఖసీదాలు (ప్రశంసలు) రాశాడు. పారితోషికాలు పొందాడు. మర్సియాలు (శోక గీతిక) లు రాయడంలో కూడా గాలిబ్ ది అందె వేసిన చేయి. గాలిబ్ పెంచి పోషించిన దత్త పుత్రుడు చనిపోయినపుడు రాసిన మర్సియా ఉర్దూ సాహిత్య ప్రపంచంలో ఒక అసదృశ కవనమై నిలిచిందట .
స్థూలంగా చూస్తే గాలిబ్ కేవలం సాంసారిక ప్రణయలాలస, తన్నిహిత ప్రమోద వేదనాక్రోశాలలో ఇరుక్కుపోయాడనిపిస్తుంది. కాని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఒక అలౌకిక అలజడి, పర్యుత్సుకత వెలువడుతాయి. ఉపమానాలను రమ్యాతిరమ్యంగా రాణింపజేసే రాసోపాసకుడు గాలిబ్. " నీ ఇంటి వాకిట శిలనయినా కాను ఈ బ్రతుకెంత వ్యర్థమో! పాద స్పర్శయిన మిగిలేది నిత్యం నాదెంత దౌర్భాగ్యమో! " సాదా సీదా శబ్దాలతో కూడా రసస్వరూపాన్ని భావాన్ని చమత్కారంతో విగ్రహంలా నిలబెట్టగల దిట్ట గాలిబ్. ఇది పరిశీలించండి. " ఆమె వోరచూపుతో మోముపై తేజస్సు అలరారు; భావించిరి అది కని రోగికి కుశలమేనని వారు." ఇట్లా అనేకానేక రమణీయ భావచిత్రాలతో సాగుతుంది గాలిబ్ ప్రణయప్రయాణం. తన కల్లోలిత దైనందిన జీవితాన్ని, అనుభవించిన రసికతను కవితగా చెప్పుకున్నాడు గాలిబ్. గాలిబ్ ప్రియురాలు ఎవరో మనకు ఇదమిత్థంగా ఎక్కడా కనిపించదు. ప్రియురాలు ఉండేదని అంటారు. కాని ఆమె కావ్యంలో దృశ్యాదృశ్య శిల్పంలా ఉంటుంది. అంతా కప్పి చెప్తాడు. కప్పిచెప్పేదే కదా కావ్యం. అయితే ప్రేయసీ విశ్లేష దు:ఖాన్ని మాత్రం తనివి తీరా అనుభవించాడు, రెండు విధాలా. విరహ వేదన కాళరాత్రి కన్నా కష్టతరం అంటూనే, ప్రేమవల్ల జీవించే మజా సిద్ధించింది, వేదనకౌషధం లభించింది, ఔషధంలేని మదనవేదన వరించింది అంటాడు.
గాలిబ్ సారస్వతనిధిలోంచి నేను వందకు పైచిలుకు షేర్లను ఎంపికచేసుకొని తెలిగించాను. నా సామర్థ్యానికి అనుగుణంగా మొదట ఉర్దూలోనే కవితనర్థం చేసుకొని తత్సమాన గౌరవంగల పదచయనంతో అనువాదానికి ఉపక్రమించాను. ఉర్దూ వాక్సంప్రదాయాన్ని (idiom) తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఒక కావ్యానికి అనువాదం అగ్నిపరీక్షాలాంటిదని విజ్ఞుల అభిప్రాయం. నిజమైన కవిత్వం మాత్రమే ఈ పరీక్షకు నిలబడుతుంది. కవిత్వంకాని మాటలకూర్పు ఎగిరిపోతుంది. నేను అంత్య ప్రాస కోసం ఆరాటపడి భావానికి విఘాతం కలిగించ లేదు. ఒక లయ, శ్రావ్యత స్వాభావికంగా యేర్పడేట్లు మాత్రం ప్రయత్నించాను. కొన్ని సందర్భాలలో అదనంగా విశేషణాలు వాడడం అనివార్యమయినది. అలా కాకపొతే, భావావిష్కరణ అసంపూర్ణంగా అవగతమయ్యే ప్రమాదముంది.
నేను చేసినా ఈ అనువాద ప్రక్రియలో నేను పరామర్శించిన గ్రంథాలు: Ghalib, Life, Letters and Ghazals, edited by Ralph Russell, Oxford, Diwan-e-Ghalib by T.P. Issar, A Desertful of Roses by Frances W. Pritchet, Columbia University, మిర్జా గాలిబ్, జీవితం-రచనలు by డాక్టర్ ఎస్. సదాశివ. మఖ్దూం సాబ్రి, ఎం. జమాన్ & నవేద్ అఖ్తర్ గార్ల ఉర్దూ నిఘంటువులు చాల ఉపయోగపడ్డాయి. Platts, Johnson Thompson online Urdu dictionary నాకు చాలా ఉపయోగపడింది. సంస్కృత పదాల విస్తృత అర్థాలకోసం, Monier-Williams, V. S. Apte ల నిఘంటువులు వాడుకున్నాను.
Dear Sir I chanced across your blog only today. I am also an ardent lover of Ghalib Ghazals.
ReplyDeleteI am glad to note that you had translated some of them into telugu. I wish have a copy of your book on Ghalib.
Kindly let me know can I get a copy of your book .
my contact details
P VIJAY KUMAR
Retd GM ONGC, Rajahmundry
Mob: 9640128560
Mail ID vijaykumar51@gmail.com